రబీంధ్రనాధ్ ఠాగూర్
మనలో ఒక పెద్ద దౌర్భల్యం ఉన్నది. మనలోని గొప్పవారిని మనం గుర్తించం: గుర్తించినా, పెద్దవారు గుర్తించన తర్వాతనే మనం గుర్తిస్తాం. ఇది విశ్వకవి " రబీంధ్రనాధ్ ఠాగూర్ " కు సయితం తప్పలేదు.
ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య బహుమతి 1913 లో లభించింది. ఆయన " గీతాంజలి " గేయ సంపుటికి ఇది లభించింది. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చిందన్న వార్త వెలువడగానే యావత్ భారతం ఆయనను ఆకాశానికి ఎత్తివేసింది. పత్రికలు ఆయన కవితా వైదుషాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక సంచికలు ప్రచురించాయి.
ఒక ప్రత్యేక రైలు వేసుకుని దే్శంలోని మేధావులు, కళా, సాహితీ విమర్శకులు, రచయతలు కలకత్తాలో వున్న రవీంద్రునీ అభినందంచడానికి వెళ్లారు. వారిని చూడగానే వారు ఒకటే అన్నారు.
" మీ అభినందనలు నేను స్వీకరించడం లేదు. " గీతాంజలీ " లోని గేయాలన్నీ మెదట బెంగాలీ భాషలో, బెంగాలీ పత్రికలలో ప్రచురించబడ్డాయి. అప్పుడు మీరెవ్వరూ వాటిని మెచ్చుకోలేదు. పైపెచ్చు , వాటిని తీవ్రంగా విమర్శించారు కూడ. వాటి ఇంగ్లీష్ అనువాదాన్ని పాశ్యాత్య ప్రపంచం ప్రశంచింది. నోబెల్ బహుమతి ఇస్తే, ఇప్పుడు మీరు మెచ్చుకోవడానికి వచ్చారా? అప్పుడు లేని గొప్పతనం నాలో ఇప్పుడు ఎక్కడినుండి వచ్చింది? అప్పటి గీతాంజలే ఇప్పటి నోబెల్ గీతంజలి. నాకు మీ అభినందనలు వద్దు, సన్మానాలు వద్దు! " అని ఠాగూర్ నిష్కర్షగా చెప్పేసరికి ఆ వచ్చినవారు నిర్విణ్ణులైనారు.
అందుకే ఒక కవి " ఏ గతి రచించితేని సమకాలము వారలు మెచ్చరే కదా! " అని వాపోయాడు.