దివ్య దృష్టి
మిసెస్ వాట్సన్ అమెరికాలో ఒక మినిష్టర్ కూతురు. చిన్నతనంనుండి ఆమె క్రమశిక్షణతో పెరిగింది. తండ్రివద్ద ఉంటె రాజకీయాలు అబ్బుతాయోమోనని ఆమె తాతగారు తన వద్దనే ఉంచుకొని ఆలనా పాలనా చూసేవాడు. ఆమెకు ముడనమ్మక్కాలంటే తగని మంట.
వాట్సన్ వివాహం జరిపిన పిదప ఆమె ఇండియానా రాష్ట్రం వచ్చి స్థిరపడింది. ఇద్దరు పిల్లలు. తండ్రికన్నా తాతగారి వద్దనే ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆమె తాతగారింటికి నెలకు ఒక్కసారైనా వెళ్ళకుండా ఉండలేకపోయేది. తండ్రిని ఎప్పుడో ఏడాదికో, రెండేళ్లకు ఒకసారో చూసేది.
ఒకరోజు ఇంట్లో అందరూ పడుకొని ఉండగా అర్థరాత్రి వాట్సన్ ఉల్లిక్కిపడి లేచింది. ఎవరో వచ్చి లేపినట్లుగా లేచి, చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ణయించుకున్నాక తలుపులన్నీ మరోసారి వేసి ఉన్నాయని చూసుకొని పడుకుంది. ఆ నిద్ర ఎంతోసేపు లేదు. తెల్లవారు ఝామున సరిగ్గా పావు తక్కువ నాలుగు గంటలకు ఆమెను ఎవరో తట్టి లేపుతున్నట్లై లేచింది. చూస్తే వచ్చి లేపింది ఎవరో కాదు - తన తాతయ్యే. కంగారు పడవద్దని చెప్పి, తన మంచంమీద కూర్చొని, తానూ మరో ఐయిదు నిముషాలలో మరణించబోతున్నాననీ, ఆ విషయం నీతో చెప్దామని వచ్చానని చెప్పాడు. తనను అత్యంత ప్రేమానురాగాలతో చూసే మనమరాలి తలపై నిమిరి మాయమయ్యాడు.
మరుక్షణం "తాతయ్య నువ్వు మరణించడానికి వీలులేదు" అని గట్టిగా అరుస్తూ మిసెస్ వాట్సన్ పక్కమీద నుండి లేచింది. ఆ అరుపుకు పక్కనే ఉన్న భర్త, పిల్లలు కూడా ఉల్లిక్కిపడి లేచారు. భర్త అసలు సంగతి ఏంటి అని అడిగాడు. మిసెస్ వాట్సన్ జరిగిన సంగతి చెప్పింది.
"అదంతా కేవలం కల, నేను నమ్మను. నువ్వు కుడా మనసు పాడుచేసుకోకు. హాయిగా పడుకో" అని భర్త ముసుగుతన్నబోయాడు. కాని మిసెస్ వాట్సన్ "నువ్వు వెంటనే ఫోన్ చేసి మా తాతగారు ఎలా ఉన్నారో తెలుసుకోనితిరాలి" అని బలవంతంగా బయటకు పంపించింది.
వాట్సన్ బయటకు వచ్చి, ఎదిరింట్లో ఉన్న ఫోన్ను ఉపయోగించి మామగారికి ఫోన్ చేశాడు. ఫోన్ అందుకున్న మామగారు "మేమే మీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఇప్పుడే మా నాన్నగారు గుండె ఆగి మరణించారు. డాక్టర్లు ఇప్పుడే ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. మేరు వెంటనే బయలుదేరి రండి." అని చెప్పాడు.
మిసెస్ వాట్సన్ ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు ఆమెలో అంతర్లీనమైన ఆ శక్తి తన దగ్గరి వారికేదో విపత్తు వాటిల్లబోతుందని హెచ్చరించగా ఉల్లిక్కిపడి లేచిందనీ, ఆ తరువాత తెల్లవారు ఝామున తన తాత వచ్చి తను చచ్చిపోతున్నట్లు చెప్పినట్లుగా తనలోని శక్తి చెప్పిందనీ, నిజంగా ఆమె తన తాత రావటం, మాట్లాడటం అనేది కేవలం భ్రమని వారు నిర్ణయించారు.
సౌజన్యం : డా|| బి.వి.పట్టాబిరామ్