మదనమోహన మాలవ్య
ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎంతటి అవమానాన్ని అయినా భరించిన మహాపురుషులెందరో వున్నారు. అట్టివారిలో కాశీ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్తాపకుడు పండిట్ మదనమోహన మాలవ్య ఒకరు.
విశ్వకవి రవీంద్రుడు విశ్వభారతి విద్యాసంస్థను స్థాపించి, దానికి విశ్వవ్యాప్తమైన పేరు ప్రతిష్టలు తెస్తే, మాలవ్యజీ నెలకోల్పిన కాశీ విశ్వవిద్యాలయం ఆనాడు జాతీయ స్థాయిలో మహోన్నతమైన కీర్తిప్రతిష్టలు సాధించింది. ఎందరో జాతీయ నాయకులు ఆ విశ్వవిద్యాలయంలో విద్యా్భ్యాసం చేసినవారే.
ఆ మహా విద్యాసంస్థను నెలకొల్పడానికి, నిలపడానికి మాలవ్యా పడని కష్టం లేదు. దేశమంత పర్యటించి, ఎక్కడ లభిస్తే అక్కడల్లా విరాళాలు సేకరించి ఆ సంస్థను స్థాపించడానికి ఎంత శ్రమించారో, దాన్ని నిలపడానికి అంతే శ్రమించారు. అందువల్లనే మహాత్మగాంధీ మాలవ్యాగారికి " యాచకుల రాజు " అని బిరుదిచ్చారు.
కాశీ విశ్వవిద్యాలయానికి విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఒకసారి మాలవ్యాజీ నిజాం నవాబు వద్దకు వెళ్ళారు. నిజాం నవాబు శ్రీ ఉస్మానాలీఖాన్ పరమ పిసినారి అని పేరు. కోట్లాది రూపాయల ఆస్తీ వున్న అతి నిరడంబర జీవి. ఎన్ని తరాలకైనా తరగని సంపద వున్నా, ఆయన ఒక కుక్కి మంచం లో తన పెంపుడు మేకపిల్లను పెట్టుకుని పడుకునేవాడు.
తనను విరాళం అడిగిన మాలవ్యకు నిజాం నవాబు తొంటి చెయ్యి చూపించాడు. హిందూ సంస్థకు తాను ససేమిరా విరాళం ఇవ్వనని స్పష్టం చేశాడు. అయినా మాలవ్యా ఆ నవాబును అంత తేలికగా వదిలిపెట్టదలుచుకోలేదు.
నిజాం నవాబు ప్రతి శ్రుక్రవారం మసీదులో నమాజు చేసి, బయటకు వచ్చి, బిచ్చగాళ్ళకు ధర్మం చేసేవారు, ఇది తెలిసిన మాలవ్యా ఒక శుక్రవారంనాడు నవాబు నమాజు చేసుకోని బయటకు వఛ్ఛే సమయానికి అక్కడ వున్న బిచ్చగాళ్ళ క్యూలో తాను కూడా నిలబడి వున్నాడు. తీరా మాలవ్యా వద్దకు వచ్చేసరికి నవాబుగారు ఆయనను చూచి ఆశ్చర్య పోయాడు!
" నాకు మీరిచ్చే పైసలను కాశీ విశ్వవిధ్యాలయం నిధికి మీ పేరిట జమకడతాను. ఇది ప్రపచంలోని అత్యంత ధనికుడైన నిజాం నవాబుగారు కాశీ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన భూరి విరాళం అని వ్రాస్తాను. " అని మాలవ్యాజీ అనేసరికి నవాబు సిగ్గు పడ్దారు. మాలవ్యను తనతో తీసుకు వచ్చి పెద్ద మొత్తమిచ్చి పంపించారు!