జవహ్రర్లాల్ నెహ్రూ
ఈ రోజులలో పరిపాలకులైన వారిలో అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, స్వార్ధం పెరిగిపోతున్నవని సర్వత్రా విమర్శలు, ఆరోపనులు, పెచ్చరిల్లుతున్నాయి. అధికారంలో వున్నవారు చట్టాలను చుట్టాల ప్రయోజనాలకే వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడ వినవస్తున్నాయి; రకరకాల " స్కామ్‌లే " అందుకు నిదర్శనాలు.
భారతీయుల ఆరాధ్య నాయకుడు, మన ప్రధమ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ రాజకీయ జీవితం తొలి దశలోని ఒక సంఘటన రాజకీయవాదులందరూ మననం చేసుకోదగింది.
జవహార్లాల్ నెహ్రూ తన రాజకీయ జీవిత ప్రారంభదశలో అలహాబాద్ మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికైనారు-1922 లో. ఒకరోజున పండిట్ నెహ్రూ ఆఫీసులో కుర్చోని పనిచేసుకుంటున్నారు. నీటి పన్ను వసూలు చేసే సూపరింటెండేంట్ వచ్చి, కొందరు సకాలంలో నీటి పన్ను కట్టలేదని, నిబంధనల ప్రకారం అట్టి పౌరుల నీటి పంపుల కనెక్షన్ లను రద్దు చేయాలని పేర్కోంటూ,అట్టివారి జాబితాను నెహ్రూ ముందు పెట్టాడు.
ఆ జాబితా ఒక్కసారి ఆసాంతం చూచిన మునిసిపల్ చైర్మన్ నెహ్రూ పన్ను కట్టనివారి నీటి పంపులను తొలగించ్వలసిందేనని ఉత్తరవు చేశారు. సూపరింటెండెంటు తెల్లబోయాడు!
" పన్ను కట్టని వారిలో ఆలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టీస్, పోలీసు ఇన్ స్పెక్టర్- జనరల్, ఇంకా ఎందరో ప్రముఖుల పేర్లు కూడా వున్నాయికదా! వారి నీటి పంపులను ఎలా తొలగించేది? " అని సూపరింటెండెంట్ భయపడుతూ నసిగాడు!
ఎవరైతేనేమి? పెద్దవారికి ఒక రూలు, చిన్నవారికి ఒక రూల? ఉన్నత స్థితిలో వున్నవారు విధినిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా వుండాలి. హైకోర్టు చీఫ్ జస్టీస్ అయినా సరే, పంపు కనెక్షన్ " కట్ చేయండి " అని నెహ్రూ గట్టిగా చెప్పాడు.
" ఆ జాబితాలో మీ ఇంటి కనెక్షన్ కూడా ఉన్నదండి! చూడండి! " అని భయపడుతూనే అన్నాడు, తిరిగి సూపరింటెండెంట్. " మా ఇంటి కనెక్షన్ అయినాసరే, పన్ను కట్టనపుడు నిబంధనల ప్రకారం చర్య తీసుకోవలిసిందే! " అన్నారు నెహ్రూ. సాయంత్రమయ్యే సరికి అలహాబాద్ లోని నీటి పన్ను కట్టని సామాన్య పౌరుల కనెక్షన్లతో పాటు ప్రముఖులు, పెద్ద అధికారుల నీటి కనెక్షన్‌లు కూడా తీసివేశారు. పట్టణ్మంతా గగ్గోలు!
రాత్రి జవహార్లాల్ ఇంటికి వెళ్ళేసరికి తండ్రి మోతిలాల్ నెహ్రూ ఆయనపై విరుచుకు పడ్డారు. " మన నీటి పంపు కనెక్షన్ నా పేరుతో వుందని నీకు తెలియదా? కనెక్షన్ తీసి వేస్తామని నోటీసయినా ఇవ్వకుండా, మీ మునిసిపాలిటీ ఇలా చేయడం తప్పు కాదా? " అని ఆ తండ్రి కొడుకుపై ఎగిరి పడ్డారు. వెంటనే నెహ్రూ---
" బాధ్యులైన, ఉన్నతులైన పౌరులు సకాలంలో పన్ను కట్టకపోవటం తప్పు కాదా? పన్ను కట్టవలిసిన తేదీ దాటిపోతుందని మీకు తెలియదా? " అని నెహ్రూ కూడ నిష్కర్షగానే సమాధానమిచ్చారు, " పేదవారైనా, పెద్దవారైనా నిబంధనలందరికీ సమానమే " అని పండిట్ నెహ్రూ చెప్పిన జవాబుకు ఆ తండ్రి మెదట చిర్రుబుర్రుమన్నా, తరువాత తన కుమారుడి న్యాయ దృష్టికి, నిజాయితీకి లోలోన సంతోషించినట్టు ఆ తరువాత నెహ్రూజీ ఒకసారి చెప్పుకున్నారు.
ఇప్పుడు అంత నిష్కర్షగా, నిష్పాక్షికంగా నిబంధనలు పాటించే పాలకులు ఎందరున్నారు?